Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ పై ఎంపీ కవిత వ్యంగ్య వ్యాఖ్యలు

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయనెప్పుడూ మేకప్, పేకప్ వ్యక్తన్నారు. ఎన్నికల ముందు కొద్ది మేకప్ తో వస్తారని, కొంచెం నటించి వెళ్లిపోతారనీ అన్నారు. కానీ, తామెప్పుడూ ప్రజలతోనే ఉంటామని, అలాగే కొనసాగుతామనీ అన్నారు. హైదరాబాదులోని ఓ ఆంగ్ల పత్రిక కార్యాలయంలో తొంబై నిమిషాల పాటు మాట్లాడిన కవిత, పలు విషయాలపై సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగానే పవన్ కల్యాణ్ ను ఇక మనం చూడగలమా? అంటూ ప్రశ్నించిన ఆమె పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. మాటకారితనం తనకు వారసత్వంగా వచ్చింది కాదని, ఎన్నో ఏళ్లు కష్టపడి అలవర్చుకున్నానని చెప్పారు. ఇదే సందర్భంలో తెలంగాణలో స్థానికత నిబంధనను సమర్థించిన ఎంపీ, ఆ నిబంధన తమ ప్రజలకు చాలా అవసరమన్నారు. ఇతర రాష్ట్రాల్లో స్థానిక, జిల్లా, జోనల్ రిజర్వేషన్స్ పరంగా చాలా చట్టాలున్నాయని, ఇక్కడా అలాంటి నిబంధన పెట్టాలనుకోవడం ఏ మాత్రం తప్పుకాదనీ అన్నారు. హైదరాబాదు అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని, గోల్కొండ, ఛార్మినార్ కూడా అని పేర్కొన్నారు.

More Telugu News